ఇవాళ అపర ఏకాదశి. ఈ తిథి ప్రధానంగా విష్ణుమూర్తి పూజకు శ్రేష్టమైనది. ఈ రోజున శ్రీ విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన వామనావతారాన్ని అపర ఏకాదశి రోజు పూజించాలని శాస్త్రం చెబుతోంది. అపర ఏకాదశి రోజున ఏం చేయాలంటే.. గంగా స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండాలి. అనంతరంలో వామనుడికి ఇంట్లో కానీ.. దేవాలయాల్లో కానీ తులిసి దళాలతో అర్పించాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అనంతరం పువ్వులు, తమలాపాకులు, అరటి పండ్లు, కొబ్బరికాయ స్వామివారికి సమర్పించాలి. అలాగే విష్ణుమూర్తికి చక్కెర పొంగలి చాలా ఇష్టమైన నైవేద్యం కాబట్టి వీలైతే దానిని సమర్పించాలి.
అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసినా మంచిదే. అలాగే అన్నదానం, చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు వంటివి అందించాలి. ఇలా చేయడం వలన పది జన్మల పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈరోజున ఉపవాసం చేసేవారు సూర్యోదయం నుంచి ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. ఇక సాయంత్రం దేవుని దగ్గర దీపారాధాన చేసి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత పాలు లేదంటే పండ్లు తీసుకుని ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇక ఈ రోజున జాగరం చేసినా పుణ్యమే. జాగారం ఉండేవారు శ్రీమన్నారాయణుని కథలు, భజనలు, నామ సంకీర్తనలతో కాలక్షేపం చేయాలి. ఈ రోజున జాగారం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందట.