తిరుమల శ్రీవారి ఆలయంలో విమానం వేంకటేశ్వర స్వామి కథేంటి?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారంతా తప్పక ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వేంకటేశ్వరుని దర్శించుకుంటారు. స్వామివారిని సరిగా చూసుకునే భాగ్యం దక్కకుంటే.. విమానం వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ బాధను తొలగించుకుంటారు. అసలు విమానం వేంకటేశ్వర స్వామి కథేంటి? అంటే.. అప్పట్లో స్వామివారికి నిత్య పూజలు నిర్వహించేందుకు తొమ్మిది మంచి అర్చకుల బృందం ఉండేదట. వారంతా ఒకసారి విజయనగర రాజు వెళ్లేసరికి స్వామివారి ఆభరణాలను ధరించి కనిపించారట. అంతే.. విజయనగర రాజుకు పట్టరాని కోపం వచ్చిందట. తొమ్మిదిమంది అర్చకులనూ అక్కడికక్కడే చంపేశారట.

నరహత్య మహా పాపం అంటారు. అందునా నిత్యం శ్రీవారిని పూజించే పూజారులను.. ఆయన ఆలయంలోనే హత్య చేయడమంటే చాలా పెద్ద విషయం. దానిని మహాపరాధంగా భావించారు. వెంటనే ఆలయాన్ని మూసివేశారు. పన్నెండేళ్ల పాటు భక్తులెవరినీ ఆలయంలోనికి అనుమతించలేదట. వ్యాసరాయలు పాప పరిహారం కోసం కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట. ఇక భక్తులకు స్వామివారిని దర్శించుకులేక పోతున్నామన్న బాధను తొలగించడం కోసం ఆనంద నిలయం మొదటి అంతస్తులో విమానం వేంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్టించారట. అలా భక్తులు విమానం వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆనందించే వారట. ఇప్పటికీ అది ఆచారంగా మారింది. అయితే ఇప్పుడు ఈ విగ్రహానికి బంగారు, వెండి పూతతో మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు.

Share this post with your friends