గోవర్థనగిరి కిందకు వెళ్లని పక్షి కథ ఏమైందంటే..

శిలా వర్షం ఒకవైపు కన్నయ్య గోవర్థనగిరిని ఎత్తాడు. అంతా దాని కింద తలదాచుకున్నారు. పక్షులు మాత్రం గొడవ పడ్డాయి. ‘తమ్ముడూ, ఏమైనా కానీ, నేను కృష్ణుడి మీదా, అతను ఉన్న ప్రదేశాల మీదా వర్షం పడకుండా నా రెక్కలు పరిచి ఆపాల్సిందే. ఇదే నా కర్తవ్యం. నువ్వు కావాలంటే వెళ్ళి ఆ కొండకింద దూరు, పో’ అని యాస్కుడు గట్టిగా చెప్పాడు. బాగా ఆలోచించి ఈ శిలావర్షానికి కొండకింద ఉండటమే సరి అని తమ్ముడైన శబరుడు ఎగురుకుంటూ కొండ కిందకి పయనమైతే, పెద్దవాడైన యాస్కుడు కొండపైకి ఎగురుకుంటూ వెళ్ళాడు. తన రెక్కలన్నీ విప్పి, ఆ కొండ మీద నిలబడ్డాడు.

వారం రోజులైంది. వర్షాలు ఆపి, ఓటమిని ఒప్పుకుని, స్వర్గానికి బయలుదేరాడు ఇంద్రుడు. కొండకింద నుంచీ అందరూ బయటికి వొచ్చిన తరవాత, కొండని యథాస్థానంలో పెట్టేసి, ఇంటికి వెళ్ళి వెన్నముద్దలు తింటున్నాడు కృష్ణుడు. తమ్ముడు పక్షి వెళ్ళి బాదం చెట్టు మీద వాలి చూస్తే అన్న పక్షి అక్కడే ఉన్నాడు. మెల్లిగా అన్న దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి ‘అన్నా, అంత పెద్ద శిలా వర్షం నించి ఎలా తప్పించుకున్నావు? ఎవరునిన్ను రక్షించారు?’ అని అడిగాడు తమ్ముడు. ‘ముందర నాకు ఇది చెప్పు? కృష్ణుడు దేంతో కొండని ఎత్తిపట్టుకున్నాడు?’ అని అన్న పక్షి అడగ్గా.. చిటికెన వేలితోనని తమ్ముడు చెప్పాడు. ’మరి రెండో చేత్తో ఏమి చేశాడో తెలుసా?’ అని పలికి కళ్ళుమూసుకుని మౌనంగా అన్న పక్షి కూర్చొంది. మన కర్తవ్యాన్ని మనం నెరవేరిస్తే శ్రీకృష్ణుడు ఏ కష్టం రాకుండా కాచుకుంటాడని చెప్పకనే చెప్పింది అన్న పక్షి.

Share this post with your friends