సంక్రాంతి రోజున పిండి వంటల్లోనూ.. చివరకు స్నానం చేసేందుకు కూడా నువ్వుల నూనెను వాడుతారని తెలుసుకున్నాం కదా. అసలు సంక్రాంతికి.. నువ్వుల నూనెకు సంబంధం ఏంటో తెలుసుకుందాం. సంక్రాంతి నాడు తెల్లవారు జామునే లేచి నుదుటిన కుంకుమ పెట్టుకుని ఆ తరువాత అభ్యంగ స్నానానికి సిద్ధమవుతారు. నువ్వుల నూనెను తీసుకుని గోరు వెచ్చగా చేసి ఆ నూనెను శరీరం అంతా మర్ధన చేసి ఆపై సున్నిపిండితో నలుగు పెట్టుకుని కుంకుడు రసంతో స్నానం చేస్తారు. అసలు ఈ నువ్వులు ఎందుకు వాడుతారో తెలుసుకుందాం. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేందుకు పిండి వంటల్లో నువ్వులను వాడుతారు.
అలాగే నువ్వులు హిందూ పురాణాల ప్రకారం యమ ధర్మరాజుకు ఇష్టమట. అసలు ఈ నువ్వులనేవి విష్ణువు స్వేద బిందువులని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నువ్వులనేవి అమరత్వపు విత్తనాలని చెబుతారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతి నుంచి వాతావరణంలో సైతం మార్పు వస్తుంది. పగలు ఎక్కువగానూ.. రాత్రి తక్కువగానూ ఉంటుంది. పైగా చలి పెరుగుతుంది. ఈ సమయంలో నువ్వులు తినడం వల్ల ఒళ్లు వెచ్చగా ఉంటుందట. నువ్వుల నూనెతో శరీరాన్ని మద్దనా చేసుకోవడం శరీరానికి ఉపశమనం లభిస్తుంది. నువ్వులు దానం చేస్తే శ్రేయస్సుతో పాటు శుభం కలుగుతుందట.