రాముడితో యుద్ధంలో కుంభకర్ణుడు మరణించాడు. అతని మరణం రావణుడిని ఎంతగానో వేధించింది. ఆ సమయంలో చాలా వేదనకు గురయ్యాడు. విభీషణుడి మాట వినకుండా వెళ్లగొట్టినందుకు చింతించాడు. అప్పుడు రావణుడి కుమారులు, కుంభకర్ణుడి కుమారులు అక్కడకు వచ్చి రావణుడిని శాంత పరిచేందుకు యత్నించారు. తాము యుద్ధానికి వెళతామని చింతించ వద్దని కోరారు. అప్పుడు రావణుడు వారిని వారించినా కూడా వారైనా బతికేవారేమో కానీ తన కోరిక తీర్చాలంటూ వారిని కూడా యుద్ధానికి పంపించాడు. రావణుడి కుమారుడు నరాంతకుడు భీకర యుద్ధం చేశాడు కానీ అంగదుడి పిడికిలి దెబ్బకు తల పగిలి మరణించాడు.
ఆ తరువాత మహోదరుడిని నీలుడు, దేవాంతకుడిని, త్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు, ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించారు. అప్పుడు అతికాయుడు యుద్ధ రంగంలోకి దిగాడు. భారీ శరీరమే కాదు. బ్రహ్మ నుంచి కవచాన్ని వరంగా పొందాడు. అతడిని సంహరించడం చాలా కష్టం. అతికాయుడు యుద్ధంలో చాలా మందిని సంహరించాడు. అప్పుడు లక్ష్మణుడు అతికాయుడిని సంహరించేందుకు ఎన్ని బాణాలు వేసినా అతను నేలకొరగలేదు. అప్పుడు వాయుడదేవుడు లక్ష్మణుడితో అతికాయుడి ఒంటిపై కవచం ఉన్నంత సేపూ బాణాలేం చేయలేవని కాబట్టి దాన్ని తొలగించమని చెబుతాడు. అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి అతికాయుడిని సైతం సంహరించాడు.