హేమదంగుడికి శ్రుత దేవుడు ఏం చెప్పాడంటే..

శ్రుతదేవ మహాముని పాదాలు కడిగిన నీటి చుక్కలు తనపై పడటంతో బల్లిగా ఉన్న హేమదంగుడికి పూర్వ స్మృతి గుర్తొచ్చింది. అప్పుడు శ్రుత దేవుడు నీవెవరని అడగటంతో హేమదంగుడు తన కథ అంతా వివరించాడు. తను చేసిన పాపమేంటో తెలిసొచ్చిందని.. తన పాపాలు పోయే మార్గం చూపించమంటూ ప్రాథేయపడ్డాడు.
అప్పుడు శ్రుతదేవుడు.. ‘మహారాజా నీవెన్ని దానాలు చేసినా శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసంలో జలదానం చేయలేదు. అలాగే బ్రహ్మణోత్తములను వదిలి అపాత్ర దానం చేశావు. అందుకే నీకు ఇన్ని జన్మలు. వైశాఖ వత్రం ఆచరించలేదు’’ అని చెప్పాడు.

ఈ క్రమంలోనే హేమదంగుడికి వైశాఖ మాస వ్రత దీక్షను వివరించాడు. అలాగే తాను ఆచరించిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును హేమాంగదునికి శ్రుతదేవుడు దారపోశాడు. దీంతో బల్లి రూపాన్ని విడిచిన హేమదంగుడు శ్రుతకీర్తి మహారాజునకు, శృతదేవ మహామునికి నమస్కరించి వారి ఆజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకములకు వెళ్లిపోయాడు. అక్కడ పదివేల ఏళ్లపాటు దివ్య లోక భోగాలు అనుభవించాడు. ఆ తరువాత కాకుత్స మహారాజుగా జన్మించి ఏడు ద్వీపముల భూమిని అందరూ మెచ్చే విధంగా పాలించి శ్రీమహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడయ్యాడు. కులగురువైన వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించి వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించాడని.. అది వైశాఖ మాస వ్రతక కథ మహత్స్యమని.. అంబరీషునికి నారదుడు చెప్పాడు.

Share this post with your friends