వైశాఖంలో జలదానం చేయక, ఉత్తములు, పండితులు అయిన బ్రాహ్మణులకు కాకుండా అనర్హులకు దానం చేసిన హేమదంగుడు.. చాతక పక్షిగా జన్మించాడు. అయితే మూడు సార్లు చాతక పక్షిగా జన్మించిన హేమదంగుడు ఆ తరువాత గద్దగానూ.. కుక్కగానూ ఏడుసార్లు జన్మించాడు. చివరకు బల్లిగా కూడా జన్మించాడు. మిథిలా దేశాన్ని పాలించే శ్రుతకీర్తి మహారాజు గృహంపై ఈ బల్లి నివసించేది. ఇక తన సహజ గుణం ప్రకారం బల్లిగా జన్మించిన హేమదంగుడు గోడపై కీటకములను తింటూ జీవించేవాడు. ఒకసారి శుత్రకీర్తి మహారాజు గృహానికి శ్రుతదేవమహాముని వచ్చాడు.
వైశాఖ మాసం.. మిట్టమధ్యాహ్నం కావడంతో శ్రుతదేవ మహాముని చాలా అలసిపోయాడు. శ్రుతదేవమహామునిని చూసి శ్రుతకీర్తి మహారాజు అతనికి ఎదురెళ్లి సగౌరవంగా తీసుకు వచ్చి అతనికి సకల ఉపచారాలు చేశాడు. మహాముని పాదాలు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. ఆ నీటి చుక్కలు గోడపై ఉన్న బల్లిపై పడ్డాయి. మహర్షి పాదస్పర్శతో పునీతమైన ఆ నీళ్లు బల్లిపై పడటంతో పూర్వ జన్మ గుర్తుకు వచ్చింది. తన దోషములు తెలిసి పశ్చాత్తాపంతో తనను రక్షించమని మునిని బల్లి ప్రార్థించింది. బల్లి మానవుని వలే మాట్లాడటం చూసి విస్మయం చెందిన శ్రుతదేవ మహాముని బల్లితో అసలేం జరిగిందని ప్రశ్నించాడు. తన కష్టం తీర్చేందుకు సాయం చేస్తానని తెలిపాడు.