రుక్మిణిదేవిని ఆశ్రయించిన నారదుడు.. ఎందుకంటే..

దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా మొదలయ్యాయి. ఎవరు గొప్పో సాక్షాత్తు మహా విష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు. పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా, విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై, అతడిపై పొగడ్తల వర్షం కురిపించాడు. నారదుడు చిన్నబోయాడు.

సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు. ‘గానబంధు’ అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. ‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్లాడు. అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు. ‘నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా’ అని బదులిచ్చారు వారు. ‘ఇక్కడికెందుకొచ్చారు?’ అని ప్రశ్నించాడు నారదుడు. ‘తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాం’ అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు.

Share this post with your friends