వైశాఖ మాసంలో ఆచరించే వ్రతం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. దీనిలో భాగంగా జలదానం విశిష్టతను తెలిపే కథ గురించి కొంత మేర తెలుసుకున్నాం. అదే నారద మహర్షి, హేమదంగుడి కథ. ప్రపంచంలోని ఎన్నో దానాలు చేసిన హేమదంగుడు జలదానం మాత్రం చేయలేదు. ఎక్కడ పడితే అక్కడ సులభంగా దొరుకుతుంది కాబట్టి హేమదంగుడికి అదొక పెద్ద దానంలా అనిపించలేదు. వశిష్ట మహర్షి చెప్పినా కూడా వినలేదు. ఆ తరువాత ఏం జరిగిందంటే.. పండితులు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను విడిచిపెట్టి హేమదంగుడు వికలాంగులు, పేదవారిని, ఆచారహీనులను ఆదరించి గౌరవించాడు.
అందరూ పండితులను ఆదరిస్తే మిగిలినవారిని ఎవరు చూస్తారనేది హేమదంగుడి భావన. దీంతో అనర్హులకు దానం చేస్తూ ఉండేవాడు. అనర్హులకు ఆ దానం విలువ ఏం తెలుస్తుంది? అందుకేనేమో హేమదంగుడి దానాలన్నీ దుర్వినియోగమయ్యేవి. ఈ విషయంలోనూ అతనికి వశిష్టుడు వారించబోయాడు. కానీ వినలేదు. జలదానం చేయక, అపాత్ర దానాలు చేయడంతో మరణానంతరం హేమదంగుడు చాతక పక్షిగా జన్మించాడు. భూమి స్పర్శ తగిలిన ఒక్క నీటి చుక్కను తాగినా కూడా చాతక పక్షి మరణిస్తుంది. అందుకే ఈ పక్షి వర్షపు చుక్కలు భూమిని చేరడానికి ముందే ఒడిసి పట్టుకుని తాగేస్తుంది. అలా తన ప్రాణం నిలుపుకుంటుంది.