ఉపపాండవులు దిక్కులేని వారిగా మరణించుటకు కారణమేంటి?

ద్రౌపదికి పాండవులు ఒక్కొక్కరి కారణంగా ఒక్కో పుత్రుడు చొప్పున ఐదుగురు జన్మించారు. వీరిని ఉపపాండవులని అంటారు. ఇంత ప్రసిద్ధ వంశమున జన్మించిన ఈ ఐదుగురు ఉప పాండవులు వివాహాది సంస్కార ములు లేక దిక్కులేనివారిగా మరణించుటకు కారణమేంటన్న సందేహం చాలా మందికి కలిగి ఉంటుంది. దానికి కారణమేంటంటే.. హరిశ్చంద్రునితో అసత్యమును పలికిస్తానని విశ్వామిత్రుడు ప్రతిజ్ఞ చేశాడు. యాగ దక్షిణను తీసుకొని తిరిగి దానిని అతని వద్దనే ఉంచమని కోరి విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్లాడు. కొంత కాలానికి తపస్సు చేసుకుని తిరిగివచ్చాడు. అనంతరం హరిశ్చంద్రుడి వద్దకు వెళ్లి… తిరిగి అతని వద్ద దాచిన యాగ దక్షిణ ఇవ్వమని ఒత్తిడి తెచ్చాడు.

అప్పటికే హరిశ్చంద్రుడు సర్వం పోగొట్టుకున్నాడు. దీంతో తిరిగి ఇవ్వలేకపోయాడు. అయినా విశ్వామిత్రుడు శాంతించలేదు. చివరకు అసత్యము ఆడని హరిశ్చంద్రుడు అనేక ఇక్కట్లు పడి తన భార్యాపుత్రులను అమ్మేసి ఆ సొమ్మును విశ్వామిత్రునకు శిష్యుని ద్వారా పంపాడు. అయినా సరే.. అది సరిపోదని విశ్వామిత్రుడు ఇంకా ఇవ్వమని బాధించసాగాడు. అది చూసి ఐదుగురు దేవతలు.. విశ్వామిత్రునకు ధర్మము చెప్పేందుకు రాగా.. తనకే ధర్మము చెప్పేందుకు వస్తారా? అని వారికి శాపం ఇచ్చాడు. తాను కోరకుండానే ఐదుగుర దేవతలు ధర్మము చెప్పేందుకు వచ్చారు కాబట్టి వారంతా భూలోకమున మానవులై పుట్టాలని విశ్వామిత్రుడు శపించాడు. వారు శాప విమోచనము కోరగా వారిని పాండవ వంశమున ద్రౌపది గర్భమున జన్మించి ఎటువంటి సంస్కా రములులేక యుద్ధంలో మృతిచెంది దేవలోకానికివెళతారని విశ్వామిత్రుడు శాపవిమోచనం ఇచ్చారు. వారే ఉపపాండవులుగా జన్మించారు.

Share this post with your friends