ద్రౌపదికి ఐదుగురు భర్తలు కలుగుటకు కారణమేంటి?

ద్రుపద మహారాజు పుత్రికయైన ద్రౌపదికి ఐదుగురు భర్తలు కలుగుటకు కారణమేంటనే సందేహం మనకు వచ్చింది. దీని గురించి ఇప్పటికి మనం ఒక కథ వినే ఉన్నాం. అదేంటంటే.. పూర్వ జన్మలలో ఆమె వేదవతి. ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. ఆ సమయంలో అనామిక పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికిందట. దీంతో పరమేశ్వరుడు ఐదుగురు పతులను అనుగ్రహించాడట. అప్పుడు ఆమె ఇదేంటని వేదన చెందగా. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడట. అందుకే ద్రౌపది ఐదుగురిని వివాహమాడిందట.

ఇక దీనికి సంబంధించి మరో కథ కూడా ఉంది. పూర్వము త్వష్ట ప్రజాపతి పుత్రుడు త్రిశిరుడు మాయావియై తపస్సు చేస్తున్నాడట. ఇది గమనించిన దేవేంద్రుడు తన తేజమునకు భంగమని తలచి తన వజ్రాయుధముతో త్రిశిరుడి శిరస్సు ఖండించాడు. అది కాస్తా బ్రహ్మ హత్యాపాతకముగా మారి.. ఇంద్రుని తేజము నాలుగు భాగాలుగా విడిపోయింది. ఒక భాగము ధర్మముగా, రెండ వభాగము వాయువుగా, మూడు, నాలుగు భాగములు అశ్వనీదేవతల్లో ప్రవేశించాయట. అనంతరం ఆ తేజములు భూలోకమున కుంతీ దేవీ గర్భమునందు ధర్మరాజు, భీమ, నకుల సహదేవులుగా జన్మించాయి. ఇక ఐదవ అంశగా ఇంద్రుడు అర్జునుడిగా జన్మించాడు. ఆ తరువాత శచీదేవి ద్రుపద మహా రాజు చేసిన యాగమున హోమగుండములో ద్రౌపదిగా ఉద్భవించినది. అందువలననే ఆమెకు ఇంద్రాంశలైన ఐదుగురు భర్తలు కలిగారని చెబుతారు.

Share this post with your friends