రావణాసురుడికి గర్వమెక్కువ. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువే. అదే ఆయనను హతమార్చిందనడంలో సందేహం లేదు. విశ్రవ బ్రహ్మ కుమారుడైన రావణ బ్రహ్మ.. తపస్సు చేసి చతుర్ముఖుడైన బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. తనకు నరవానరుల నుంచి తప్ప ఇతరులతో వధించబడని వరం కావాలని కోరాడు. దీనికి కారణం కూడా చెప్పాడు. ఇతరులెవరూ తనను అంతం చేయలేనప్పుడు నరవానరులు మాత్రం అంతం చేయగలరా? అసలు తన శక్తి ముందు వారు నిలువగలరా? అందుకే వారిద్దరినీ మినహాయిస్తున్నట్టు బ్రహ్మకు రావణుసురుడు చెప్పాడు. రావణుడి ఈ ఓవర్ కాన్ఫిడెన్సే ఆయన అంతానికి కారణమైంది.
రావణుడికి బ్రహ్మ వరం ఇచ్చేశాడు. ఆ వర గర్వంతో రావణుడు చేయని అకృత్యాలు లేవు. మూడు లోకాలను సకల దేవ దానవ గణములను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అంతేనా అందమైన కాంతలను చెరబట్టాడు. ప్రతి ఒక్కరినీ పీడించుకు తిన్నాడు. అధర్మం పెచ్చుమీరినప్పుడు దైవం అవతరిస్తుందంటారు. అలా అవతరించిన వాడే శ్రీరామ చంద్రుడు. దేవతలు దశరధ మహా రాజు యజ్ఞంలో శ్రీమన్నారాయణుని ప్రార్థించగా ఆ స్వామి రాముడిగా అవతరించాడు. నరునిగా జన్మించాడు. ఆయన జన్మ రావణాసుర వధతో పూర్తి కాలేదు. ఆ తరువాత కూడా కొనసాగింది. పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి మానవులకు ఆదర్శప్రాయుడిగా రాముడు నిలిచాడు.