వట పత్ర శాయి అనే పదం మనం ఒక పాటలో విన్నాం. ‘వట పత్ర శాయికి వరహాల లాలి’ అంటూ సాగే పాట చాలా ఫేమస్ అయిపోయింది. మరి వటపత్ర శాయి అంటే ఏంటి? అంటే.. మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని అర్థం. దీనికి సంబందధించి మార్కండేయ చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు ఆరు మన్వంతరాలు అంటే నాలుగు యుగాల పాటు తపస్సు చేశాడు. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే దాదాపు 20 లక్షల సంవత్సరాలను 6 సార్లు అంటే సుమారు 12 లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడట. మరి ఇంద్రుడు ఎందుకు కామ్‌గా ఉంటాడు? తపస్సును చెడగొట్టేందుకు కొందరు అప్సరసలను పంపించాడట. కానీ మార్కండేయుడు ఏమాత్రం చలించక తన తపస్సును కొనసాగించాడట.
మార్కండేయుని తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమై “ఏం వరం కావాలో కోరుకో” అనగా.. స్వామివారి మాయను చూడాలని ఉందని అడిగాడట. దీనికి విష్ణుమూర్తి తథాస్తు అన్నాడట. కొద్దిరోజులకే విపరీతమైన గాలి, వర్షంతో సముద్రాలు పొంగి సమస్తం మునిగిపోతుండగా.. మార్కండేయుడు మాత్రం విష్ణు మాయ కారణంగా నీటిపైనే నిలిచాడట. ఆ సమయంలో మార్కండేయుడికి ఒకచోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. ఆ బాలుడే వటపత్ర శాయి అట. విష్ణుమూర్తి ఆదేశంతో ఆ బాలుడి కడుపులోకెళ్ళి చూస్తే నీట మునిగిన సమస్త భూమి, ప్రాణికోటి కనిపించాయట. అలా విష్ణుమూర్తి తన మాయను మార్కండేయునికి చూపించాడట.