వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

మే 17 నుండి 19వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించకుండా తిరుమల యాత్ర పరిపూర్ణం కాదు. పద్మసరస్సులో పుట్టి ఆకాశరాజు కూతురుగా శ్రీనివాసుని చేపట్టిన అలమేలు మంగ సాక్షాత్తూ మహాలక్ష్మియే. పద్మావతీ శ్రీనివాసుల వార్షిక కల్యాణం వైశాఖమాసంలో నిర్వహిస్తారు. అలమేలు మంగాపురం చూడనిదే తిరుపతి యాత్ర పూర్తికాదంటారు పెద్దలు. ‘ఆకాశరాజు కూతురైన పద్మావతిని శ్రీనివాసుడు పెళ్లి చేసుకున్నాడు. పద్మావతీ శ్రీనివాసుల పరిణయం తరువాత అగస్త్య మహాముని కొత్తదంపతులు ఆరు నెలలపాటు కొండ ఎక్కరాదనే నియమం పెట్టాడు. అందువల్ల ఆ దంపతులు శ్రీనివాసమంగాపురంలో ఆ ఆరునెలలూ కాలంగడిపారు. అదే నేడు శ్రీనివాస మంగాపురం అంటున్నాం. తొలుత పద్మావతి అమ్మవారికి ఇక్కడే ఆలయముండేది. తర్వాత తిరుచానూరులో కొలువైనందున అలమేలుమంగాపురం ఏర్పడింది. తిరుచానూరులో శుకమహర్షి తపస్సు చేయడం వల్ల తిరుశుకనూరని పేరొచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న అలమేలు మంగ ఆలయం 15-16 శతాబ్దాల నాటిది. ఆకాలపు శాసనాలను పరిశీలిస్తే ఆ ఊరికి చిరుచ్చుగనూరు అనే పేరు కూడా ఉందని తెలుస్తోంది.

అలమేలు మంగ ఆలయానికి ఐదు అంతస్తుల రాజగోపురం ఉంది. గర్భాలయం, అర్థమండపం, ధ్వజస్థంభం బలిపీఠాలతో సర్వాంగ సుందరంగా ఉంటుంది. చుట్టూ విశాలమైన ఎత్తయిన ప్రాకారం, వెనక వైపు కోనేరు, మధ్యలో మండపాన్ని నిర్మించారు. ఒకప్పుడు శ్రీవారి ధాన్యాగారంగా పేరొందిన ప్రదేశమే ప్రస్తుత అలమేలు మంగ ఆలయమని చెబుతారు. పద్మావతీ శ్రీనివాసుల వార్షిక కల్యాణోత్సవం వైశాఖమాసంలో మూడురోజుల పాటు నిర్వహిస్తారు. వైఖానస ఆగమం ప్రకారం ఈ ఉత్సవాలు జరుగుతాయి.

Share this post with your friends