రామ జన్మభూమి ఆలయంతో పాటు అయోధ్య పరిపాలనా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇకపై రామజన్మభూమి ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ విషయమై ఆలయ ధర్మకర్త అనిల్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. భక్తుల భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా మొబైల్ ఫోన్లపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. భక్తులంతా ఈ నిర్ణయాన్ని గౌరవించాలని అనిల్ మిశ్రా కోరారు. అయితే మొబైల్ ఫోన్లతో పాటు ఇతర విలువైన వస్తువుల భద్రతకు సదుపాయాలను సైతం కల్పించనున్నట్టు వెల్లడించారు. ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
వాస్తవానికి సాధారణ ప్రజలు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై మొదటి నుంచి నిషేధం ఉంది. ఇప్పుడు సాధారణ భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీల మొబైల్ ఫోన్లను కూడా నిషేధిస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అయోధ్యలో రామమందిరం, రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో నిర్మిస్తున్న మరో ఏడు ఆలయాల ప్రణాళికల విషయమై ఆలయ నిర్మాణ కమిటీ సమావేశం జరిగింది. మార్చి 25లోగా ఆలయ ప్రాకార నిర్మాణం.. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే రామ మందిరం భద్రపై కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.