కేరళలో చిన్ని కృష్ణుడు.. ముద్దుల కృష్ణుడు కొలువై ఉన్నాడు. ఈ మురిపాల కృష్ణుడు రెస్ట్ కొద్ది క్షణాలే.. ఆ వెంటనే ఆలయం తిరిగి తెరుస్తారు. ఆలయం తెరుచుకోలేదో గొడ్డలితో తలుపులు పగుల గొట్టైనా తీస్తారు. ఆసక్తికరంగా అనిపించే ఈ ఆలయ విశేషాలు తెలుసుకుని తీరాల్సిందే. పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం సమయంలో శ్రీకృష్ణుడు తనకు సంబంధించిన నాలుగు చేతులతో కూడిన విగ్రహాన్ని ఇచ్చాడని స్థలపురాణం చెబుతోంది. అయితే పాండవుల అజ్ఞాతవాసం ముగిసి వెళుతుంటే అక్కడి ప్రజలు విగ్రహాన్ని తమకు ఇవ్వాలని కోరగా ఇచ్చారట. స్థానికులు చిన్ని కృష్ణుడికి ఆలయం కట్టి పూజించేవారట. ఆ తరువాత ఏమైందో కానీ పూజలు చేసేవారు లేక విగ్రహాన్ని సముద్రంలో కలిపేశారు.
ఒకసారి విశ్వమంగళం స్వామియార్ ఒక పడవలో సముద్రంలో వెళుతుండగా.. ఒక ప్రాంతంలో పడవ ఆగిపోయింది. ఏమైందోనని సముద్రంలోకి దూకి చూడగా.. సముద్రపు అడుగు భాగాన శ్రీకృష్ణుని విగ్రహం కనిపించింది. దానిని తీసుకుని తూర్పువైపుగా వెళ్లి కేరళలోని కొట్టాయం సమీపంలోని తిరువరప్పు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిరాత్రి ఏకాంత సేవ అనంతరం ఈ ఆలయాన్ని కొన్ని క్షణాలే మూసేస్తారు. కొన్ని నిమిషాల్లోనే ఆలయం తెరుస్తారు. తాళం ఎక్కడ రాదోనని గొడ్డలిని సైతం సిద్ధం చేస్తారు. గ్రహణ సమయాల్లోనూ ఈ ఆలయాన్ని మూసివేయరు. కారణమేంటంటే ఈ చిన్ని కృష్ణుడికి ఆకలి ఎక్కువట. రోజుకు ఏడు సార్లు స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ ప్రసాదాన్ని భక్తులకు ఒకటికి రెండు సార్లు అడిగి మరీ పెడుతుంటారు.