రామాలయం అంటే అందులో కొలువైన దేవుళ్లు వెంటనే మనకు గుర్తొస్తారు. లక్ష్మణ సమేత సీతారాములతో పాటు ఆంజనేయ స్వామి ఉంటారు. వీరంతా ఉంటేనే మనకు అది రామాలయంలా అనిపిస్తుంది. ఏ ఒక్కరు కనిపించకున్నా అదేదో వెలితి. కానీ ఆంజనేయ స్వామి లేని రామాలయం ఒకటి ఉందని తెలుసా? వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో.. అంజన్న లేని రామాలయం దేశంలోనే అది ఒక్కటే అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిమిట్ట చాలా ఫేమస్. భారత దేశంలోనే ఎక్కడా లేని రీతిలో.. ఆంజనేయుడు కనిపించని మహత్తర రామాలయం ఇది.
కడప నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో కడపకు 27 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములు మాత్రమే కనిపిస్తారు. ఆంజనేయస్వామి కనిపించరు. ఇక సీతారాములు, లక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో ఉంటాయి. అందువల్లే దీనిని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఆ ఆలయంలో హనుమంతుడు లేకపోవడమేంటంటారా? దీనికి ఒక కథ ఉంది. యాగరక్షణ కోసం రామలక్ష్మణులను విశ్వమిత్రుడు తీసుకుని వెళతాడు. ఆ తరువాత సీతారామ కల్యాణం జరుగుతుంది. అయితే రాములవారిని దుష్ట శిక్షణ కోసం మృకండు మహర్షి, శృంగి మహర్షి ప్రార్థించడంతో… రాముల వారు సీతాలక్ష్మణులతో కలిసి వెళ్లి యాగరక్షణ చేస్తాడు. దీనికి ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించగా.. జాంబవంతుడు విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేశాడు. ఇది ఒంటిమిట్ట రామాలయం కథ.