మనందరికీ సొంతూరు ఉన్నట్టు పరమేశ్వరుడికి కూడా ఉంది. అదెక్కడ? అనేది తెలుసుకోవడంతో పాటు ఆ ఊరులోని ప్రత్యేకతలు తెలుసుకుని తీరాల్సిందే. తమిళనాడులోని రామే శ్వరం నుంచి సుమారు 75 కి.మీ దూరంలో ‘తిరుఉత్తర కోసమాంగై’ అనే గ్రామం ఉంటుంది. మధురై వెళ్లే దారిలో ఈ ప్రదేశం వస్తుంది. ఈ ఊరే శివుడి సొంతూరని చెబుతుంటారు. శివలింగం వెలిసిన మొట్టమొదటి ప్రాంతం ఇదేనంటారు. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయాన్ని నిర్మించారు. ఇక్కడ వెలిసిన రేగిపండు చెట్టు కూడా అప్పటిదేనని అంటారు. శివభక్తురాలైన మండోదరి శివుడిని ప్రార్ధించి.. తనకు శివభక్తుడిని భర్తగా ప్రసాదించమని కోరిందట. దీంతో రావణబ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు.
20 ఎకరాల్లో ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి స్వామివారిని మొగలిపువ్వుతో అలంకరిస్తారు. ఎక్కడా పూజా కోసం మొగలిపువ్వులను వాడరు. ఇక్కడ మాత్రమే వాడుతారు. ఇక్కడ శివయ్యకు సంబంధించిన మూడు లింగాలు ఉంటాయి. ఇక్క డ శివుడు శివలింగరూపంలో, మరకతరూపంలో, స్పటికలింగంలో దర్శనమిస్తాడు. నటరాజ రూపంలో ఉండే శివుని 5 అడుగుల మరకత విగ్రహం ఉంటుంది. ఆ మరకతం నుంచి వచ్చే వైబ్రేషన్స్‌ను మనం తట్టుకోవడం చాలా కష్టమట. అందుకే స్వామివారిని ఎప్పుడూ విభూది, గంధపుపూతతో ఉంచుతారు. కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. స్వామివారి స్పటికలింగానికి మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం చేసి తర్వాత లాకర్‌లో భద్రపరుస్తారు.