హిందూ సంప్రదాయంలో హారతికి చాలా ప్రాధాన్యముంది. హారతి లేకుండా ఏ పూజా సంపూర్ణమవదు. ఏ ఆలయానికి వెళ్లినా కూడా స్వామివారికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకుంటేనే మనసుకు చాలా ఆనందం. దేవుని ఆరాధించుకున్న ఫలితం దక్కిందనే భావన కలుగుతుంది. అసలు ఎందుకు హారతి ఇస్తారు? హారతి ఇచ్చే సమయంలో పాటించాల్సిన నిమయాలేంటి. దేవతలకు గంట కొడుతూ హారతి ఇవ్వడం అనేది కీలకంగా భావిస్తూ ఉంటారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం.
పురాతన వేద సాంప్రదాయాల ప్రకారం హోమం నుంచి హారతి వచ్చిందని చెబుతారు. స్కంద పురాణంలో హారతి గురించి చెప్పడం జరిగింది. అసలు హారతి ఎందుకు ఇస్తారంటే.. పూజ చేసే సమయంలో మంత్రాలు తెలియకున్నా.. పూజా విధానం రాకున్నా హారతి ఇస్తే చాలు.. మన పూజకు ఫలితం దక్కుతుందట. భగవంతుడు మన పూజను అంగీకరిస్తాడట. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. భగవంతుడికి కర్పూరంతో హారతి వెలిగించి ఇస్తారు. ఈ కర్పూరం నుంచి వచ్చే సువాసనతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రశాంతతకు హారతి చిహ్నంగా భావిస్తూ ఉంటారు.