బాగా ఆనందం వేసినప్పుడు సర్వసాధారణంగానే చప్పట్లు కొడుతుంటాం. ఎవరైనా మనసుకు హత్తుకునేలా మాట్లాడినా.. ఏదైనా మ్యాచ్ మంచి రంజుగా సాగుతున్నా చప్పట్లు చరుస్తూ మన ఆనందాన్ని వ్యక్తపరుస్తాం. అంతేకాదు.. కొన్ని ఆలయాల్లోనూ హారతులిచ్చే సమయంలోనో.. భజన సమయంలోనో.. ఇతర సమయాల్లోనూ భక్తులంతా చప్పట్లు కొడుతుంటారు. ఈ చప్పట్లు కొట్టే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? పురాణాల కాలంలోనే.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భక్త ప్రహ్లాదుడి కాలంలోనే ప్రారంభమైందట. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపునికి విష్ణువును పూజించడం, ఆయన కీర్తనలు పాడడం ఇష్టం లేదు. అసలు భగవతారాధనే నచ్చదు.
ఈ కారణంగా ప్రహ్లాదుడు భజన కీర్తనలో ఉపయోగించే సంగీత వాయిద్యాలన్నింటినీ ధ్వంసం చేశాడట. దీంతో ప్రహ్లాదుడు భజన కీర్తనలో లయను కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడట. ఆ లయను సృష్టించేందుకే ప్రహ్లాదుడు చప్పట్లు కొట్టడం ఆరంభించాడట. ఆయనను చూసిన మరికొందరు సైతం చప్పట్లు కొట్టడం ఆరంభించడం.. అలా అదొక సంప్రదాయంలా మారిపోయింది. భజన, హారతి ఇచ్చే సమయంలో భక్తులంతా ఒకేసారి చప్పట్లు కొట్టడంతో ఉత్సాహం వస్తుంది. అక్కడంతా పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. అంతేకాకుండా భక్తుడికి చప్పట్లు కొట్టడం వలన మానసిక ఏకాగ్రత, మానసిక ప్రశాంతత చేకూరుతుందట. కాబట్టి భక్తులు పూర్తి ఏకాగ్రతతో భజన, కీర్తనపై ఫోకస్ పెట్టగలుగుతారు.