భద్రాద్రిలో శ్రీరాముడి విశేషాల గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ప్రతి ఒక్క విషయమూ ఆసక్తికరంగానే ఉంటుంది. అటువంటి ఆసక్తికర విషయాల్లో ఒకటి ఏంటంటే.. శ్రీరాముడు భద్రాద్రిలో వెలిసిన వెంటనే ఆయనకు గుడి అయితే లేదు కదా. మరి ఆయనకు గుడి ఎవరు నిర్మించారు? ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే గుడి నిర్మాణానికి ముందు రామయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాడని ఒక భక్తురాలు ఆయనకు పందిరి వేసి కొలిచింది.
ఆమె పేరు పోకల దమ్మక్క. ఆమె ఒక ఆదివాసీ మహిళ.స్థలపురాణం ప్రకారం.. రామయ్య విగ్రహాన్ని తొలుత దమ్మక్కే కనుక్కుంది. దమ్మక్కకు రామయ్య కలలో కనిపించి విగ్రహం ఉన్న ప్రదేశాన్ని చెప్పారని నమ్ముతారు. స్వామివారి విగ్రహాన్ని కనుగొన్న తర్వాత ఆమె స్వామివారిపై ఎనలేని భక్తిని ప్రదర్శించింది. స్వామివారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని పందిరి వేసి మరీ దమ్మక్క పూజించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో పోకల దమ్మక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు.