పూరి జగన్నాథుని ఆలయానికి సంబంధించి బంధు మహంతి కథ ఇప్పటి వరకూ మనం సగమే తెలుసుకున్నాం. అసలైన కథ ఇంకా బాకీ ఉంది. మధ్య రాత్రి బ్రాహ్మణ రూపంలో జగన్నాథుడే స్వయంగా వచ్చి ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను బంధు మహంతి భార్య ముందు పెట్టాడు. బంధుతో పాటు పిల్లలను నిద్రలేపి అంతా కలిసి ఆ ఆహార పదార్థాలను ఆరగించాడు. ఆ తరువాత ఆ పళ్లాన్ని కడిగి ఆమె తన సంచిలో పెట్టి నిద్ర పోయారు. తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరచి, స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి, అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్లెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం వుండటాన్ని చూసి, అధికారులకు చెప్పాడు.
వాళ్ళు అర్చకులతో కలిసివచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో పూరి జగన్నాథుడిని ప్రార్థించుకోవడం మొదలు పెట్టాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకొంటూ.. అతనికేమీ తెలియదని.. కొట్టవద్దంటూ వేడుకుంది. విషయం చెప్పినా ఎవరూ వినలేదు. బంధుని కొట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద బంధు భార్య ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయ్యింది. పురి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్య రాత్రి ఒక కల వచ్చింది. “అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే, ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే!” అని స్పష్టంగా ఎవరో చెప్పారు.
ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథమందిరానికి వెళ్ళి, అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడివారు రాజుకు చెప్పారు. వారినీ అక్కడికి తీసుకురండి చెప్పి, స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి, తాళాలు తీయించాడు. ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్నవారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒడిషా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు, బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేశాడు. అంతే కాదు, అక్కడిక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిర వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు. ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపనిని నిర్వహిస్తున్నారు.