అన్న మరణాన్ని తట్టుకోలేక మరణించిన చెల్లే ఆ పైడిమాంబ..

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం గురించి తెలుసు కానీ అసలీ అమ్మవారి కథేంటనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో పైడితల్లి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. గజపతుల ఆడపడుచే అ పైడితల్లి అమ్మవారు. కొలిచిన వారికి కొంగుబంగారమై పైడితల్లి అమ్మవారుపూజలందుకుంటోంది. అసలీ అమ్మవారి కథేంటంటే.. 18వ శతాబ్దంలో విజయనగరాన్ని పాలించిన గజపతి వంశానికి చెందిన పూసపాటి పెద్ద విజయరామరాజు సోదరే పైడిమాంబ. అప్పట్లో విజయరామరాజుకు, బొబ్బిలి సంస్థానాధీశుడు రాజా గోపాల కృష్ణరంగారావుకు అస్సలు పడేది కాదు. వీరి శత్రుత్వం ముదిరి పాకాన పడి యుద్ధానికి తెరదీసింది. విజయరామరాజుకు ఫ్రెంచ్ సేనాధిపతి బుస్స్తీ అండగా నిలవడంతో బొబ్బిలిపై యుద్ధానికి కత్తి దూశాడు.

1757 జనవరి 23న యుద్ధానికి ఇరుపక్షాలు సన్నద్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పైడిమాంబ యుద్ధం వద్దని అన్నకు ఎంతగానో నచ్చజెప్పింది. కానీ సోదరి మాటను విజయరామరాజు అస్సలు ప్టటించుకోలేదు. ఫ్రెంచ్ ఫిరంగుల ధాటికి బొబ్బిలి కోట మాత్రమే కాదు.. బొబ్బిలి పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలోనే పైడిమాంబకు మసూచి సోకింది. అన్నకు ఆపద ఉందన్న విషయాన్ని దుర్గమ్మ దయతో తెలుసుకున్న పైడిమాంబ తన అనారోగ్య వార్తను చేరవేసి యుద్ధాన్ని ఆపాలంటూ అన్న వద్దకు వేగును పంపడమే కాకుండా స్వయంగా వదినతో కలిసి తను బయలుదేరుతుంది. ఈ లోపే విజయరామరాజును తాండ్రపాపారాయుడు సంహరిస్తాడు. వనంతోట వద్దకు చేరుకునే సమయానికి ఈ విషయం పైడిమాంబకు తెలుస్తుంది. దీంతో పైడిమాంబ తీవ్ర ఆవేదనకు లోనై.. అన్నలేని లోకంలో తానూ ఉండలేనని పెద్దచెరువులో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది. మరుసటి రోజు అప్పలనాయుడుకు పైడిమాంబ కలలో కనిపించి పెద్ద చెరువుకు పశ్చిమం వైపు తన విగ్రహం దొరుకుతుందని.. దానికి ఆలయం కట్టించాలని చెప్పింది. ఆ వెంటనే అక్కడకు వెళ్లిన అప్పలనాయుడు జాలరుల సాయంతో పైడితల్లి విగ్రహాన్ని బయటకు తీసి చెరువు ఒడ్డున ఆలయం నిర్మించారు.

Share this post with your friends