కార్వేటినగరం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం ధ్వజారోహణంతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాలపై ఊరేగుతూ స్వామివారు భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముగింపు రోజైన గురువారం ఉదయం స్వామివారికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9.15 గంటల వరకు ఆలయ సమీపంలోని స్కంధ పుష్కరిణిలో అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
స్నపన తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు. అనంతరం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారికి ధ్వజారోహణం నిర్వహించారు. దీంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.