రుద్రాక్షను ధరించడం వల్ల ఉపయోగాలేంటంటే..

హిందూ శాస్త్రాల్లో, పురాణాలలో రుద్రాక్షకు చాలా ప్రాధాన్యం ఇవ్వబడింది. ఇది పరమశివుని స్వరూపమని నమ్మకం. రుద్రుని అక్షువుల నుంచి జారిపడిన నీటి బిందువులు వృక్షాలయ్యాయట. ఆ వృక్షాల నుంచి కాసిన కాయలనే రుద్రాక్షలని చెబుతారు. అందుకే రుద్రాక్షకు చాలా శక్తి ఉంటుందట. అంతేకాకుండా ఔషధ గుణాలను సైతం కలిగి ఉంటుందట. పూర్వం రుషులు కూడా రుద్రాక్షతో తమ శరీర శోభన వృద్ధి చేసుకున్నారు. ఇవి ఇప్పుడే కాదు.. పురాణ కాలం నుంచి ఉపయోగంలో ఉన్నాయి. అప్పట్లో ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించే వారట. రుద్రాక్షను ధరించిన వ్యక్తి సాక్షాత్తూ రుద్రునికి సమానమని పురాణాల్లో కూడా చెప్పబడింది.

రుద్రాక్షను ధరించటం వీలుకాని వారు.. నియమ నిబంధనలను పాటించనివారు ఇంట్లోని పూజ గదిలో రుద్రాక్షను ఉంచి పూజ చేసుకుంటూ ఉంటారు. రుద్రాక్షను ధరించిన వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడట. అయితే వీటిని ఎలా పడితే అలా ధరించకూడదు. వీటిని ధరించేందుకు ఒక ధార్మిక విధానం ఉంది. దాని ప్రకారం రుద్రాక్షను ధరిస్తే ఫలితం మరింత బాగుంటుందని నమ్మకం. రుద్రాక్ష ధరించిన వారికి అకాల మృత్యు బాధ ఉండదట. సంపూర్ణ ఆయుష్షుతో ఉంటారని నమ్మకం. రుద్రాక్ష కేవలం ధార్మికంగానే కాకుండా ఆయుర్వేదపరంగానూ ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో వ్యాధులను నయం చేయడానికి రుద్రాక్షను వినియోగిస్తారు.

Share this post with your friends