వైభవంగా జరిగిన 11వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం

లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఇవాళ ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ 11వ విడ‌త అయోధ్యకాండ అఖండ పారాయణం జ‌రిగింది. అయోధ్యకాండలో 40 నుంచి 44వ‌ సర్గ వ‌ర‌కూ మొత్తం ఐదు స‌ర్గల్లో 162 శ్లోకాలు, యోగ‌వాశిష్టం, ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 187 శ్లోకాల‌ను పారాయణం చేశారు. ఈ అయోధ్యకాండ పారాయణం కార్యక్రమానికి ఎస్వీ వేద విఙ్ఞాన పీఠం, ఎస్వీవేద విశ్వవిద్యాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. రామాయణంలోని విభాగాలను “కాండములు” అంటారు. ఒక్కో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో మొత్తంగా ఏడు కాండములు ఉన్నాయి. మొదటిది బాలకాండ కాగా.. అయోధ్య కాండ రెండవది. అయితే ఏడవ కాండమును వాల్మీకి రాయలేదని అంటారు. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము. అయితే అయోధ్య కాండములోని ప్రధానంగా శ్రీరాముని పట్టాభిషేక సన్నాహాలు, కైకేయి కోరిక, దశరధుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము, వన ప్రయాణం, గుహుని ఆతిథ్యం, చిత్రకూట నివాసం, దశరథుని మరణం, భరతుని దు:ఖం వంటి అంశాలున్నాయి.

Share this post with your friends