అర్జనుడు మహా పరాక్రమవంతుడు. ఒకసారి స్వర్గలోకానికి వెళతాడు. అక్కడ అర్జనుడికి దేవతల నుంచి ఘన స్వాగతం లభిస్తుంది. ఇక అర్జనుడి కోసం స్వర్గంలో నృత్య ప్రదర్శనను సైతం దేవతలు ఏర్పాటు చేస్తారు. ఊర్వశి నృత్య ప్రదర్శన మహాద్భుతం. అర్జనుడిని సైతం చూపు తిప్పుకోనివ్వలేదు. అది చూసిన ఊర్వశి… అర్జనుడు తనను మోహించాడని భ్రమపడింది. ఆమె కూడా అర్జనుడిపై తన్మయత్వంతో నృత్యం చేసింది. నృత్య ప్రదర్శన అనంతరం అర్జనుడు తనకు కేటాయించిన గదిలో విశ్రాంతి తీసుకునేందుకు వెళతాడు. ఆ వెంటనే ఊర్వశి కూడా వెళుతుంది. ఆమెను చూడగానే అర్జనుడు వినయపూర్వకంగా లేచి నిలబడతాడు.
అర్జనుడితో ఊర్వశి నేను నిన్ను తొలి చూపులోనే మోహించాను. నువ్వు కూడా నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నావని అర్ధమైంది. కాబట్టి నిన్ను సంతోష పెట్టేందుకే ఇక్కడికి వచ్చానని చెబుతుంది. ఆ మాటలకు ఒకింత ఖిన్నుడైన అర్జనుడు.. మా వంశస్థుడైన పురారవుడి భార్యవి నువ్వు.. పైగా ఇంద్రుడి ఇష్ట సఖివి. ఒకరకంగా నువ్వు నాకు తల్లితో సమానం.. ఇలాంటివి అనైనతికమని చెబుతాడు. ఊర్వశి ఎంత నచ్చజెప్పేందుకు యత్నించినా అర్జనుడు వినకపోవడంతో ఆమె ఆగ్రహిస్తుంది. తనను ఇంతవరకూ తిరస్కరించిన వారు లేరని.. అటువంటిది నువ్వు నన్ను తిరస్కరిస్తావా? అంటూ నువ్వు కొంతకాలం పాటు నపుంశకుడిగా జీవిస్తావని శాపమిచ్చింది. అలా అర్జనుడు విరాటరాజు కొలువులో బృహన్నల అవతారం ఎత్తవలిసి వచ్చింది.