శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం వైభవంగా నిర్వహించారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో వార్షిక కుంభోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు ఈ పూజలన్నింటినీ అచారానుసారం అమ్మవారికి ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం ఆలయ ముందు భాగంలో రజకునితో మగ్గు వేయించారు. తరువాత శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి మొదటి విడత సాత్వికబలి ఇచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారికి వందల సంఖ్యలో కొబ్బరి కాయలతో పాటు గుమ్మడి కాయలు, నిమ్మ కాయలను సాత్విక బలిగా అర్చకులు, భక్తులు సమర్పించారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి మంగళ హారతి ివ్వనున్నారు. ఆ తరువాత అమ్మవారం ఉగ్రరూపం స్వామివారిపై పడుకుండా తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. అమ్మవారిని పెరుగన్నం, జీలకర్ర, ఉల్లిపాయలు, శొంఠి భక్షాలతో కప్పివేశారు. అన్నాన్ని రాసిగా ఆలయ ముఖమండపం బయట పోసి నైవేద్యం సమర్పించనున్నారు. ఇక అనంతరం కీలక ఘట్టం ఒకటి ఉంటుంది. స్త్రీ వేష ధారణలో ఆలయ ఉద్యోగి ఒకరు అమ్మవారికి కుంభహారతి ఇవ్వనున్నారు. ఆ తరువాత రెండో విడత సాత్విక బలిని అమ్మవారికి ఇవ్వనున్నారు.