నంద్యాల జిల్లా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. దీనిలో భాగంగా అమ్మవారికి అన్నాన్ని కుంభరాసిగా పోసి సాత్విక బలిగా సమర్పించారు. ఈ క్రమంలోనే అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలను పెద్ద ఎత్తున భక్తులు సమర్పించారు. నిన్న సాయంత్రం అర్చకులు, ఆలయ అధికారులు కుటుంబ సమేతంగా రెండో విడత సాత్విక బలిని అమ్మవారికి సమర్పించారు. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున నిమ్మకాయలు, గుమ్మడి కాయలు, కొబ్బరికాయలను అమ్మవారికి సమర్పించారు.
అనంతరం అమ్మవారికి మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం అమ్మవారి ఉగ్రరూపం శ్రీ స్వామివారిపై పడకుండా స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు. శ్రీ స్వామివారి అలయంలో పనిచేసే ఉద్యోగి ‘స్త్రీ’ వేషధారణలో అలంకరించుకుని అక్కడకు వచ్చారు. స్త్రీ వేషధారణలో ఉన్న వ్యక్తి చేతిలో హారతితో వేదమంత్రోత్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.ఆలయానికి రాగానే ప్రధానార్చకులు ఆలయ ద్వారాలను తెరిచారు. ఆ వెంటనే స్త్రీ వేషధారణలో ఉన్న ఉద్యోగి అమ్మవారికి కుంభ హారతి ఇచ్చారు. అలా ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే హారతి ఇస్తే అమ్మవారి చూపు శ్రీ చక్రం వెనుక ఉన్న కుంభరాశిపై పడి అక్కడి నుంచి హారతిచ్చిన స్త్రీ వేషధారిపై పడుతుందని నమ్మకం.