సెయింట్ లూయిస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో తొలిసారిగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 2024 వార్షిక బ్రహ్మోత్సవంలో నాలుగో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం హోమం నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగు వారు హాజరయ్యారు. సాయంత్రం స్థానిక సాంస్కృతిక కేంద్రంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

ఇక నేటితో శ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రతువుకు పుష్పయాగంతో ఆలయ పూజారులు ముగింపు పలుకుతారని మీడియా కమిటీ ఛైర్మన్ సూరపనేని రాజా పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు దేవాలయ నిర్వాహకులు అయిదు రోజుల పాటు ఉచితంగా రెండు పూటలా హైందవ సాంప్రదాయ శాకాహార భోజనాన్ని వడ్డించారు. ఐదు రోజులుగా సెయింట్ లూయిస్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నామ జపంతో పులకించి పోతోంది. అగ్రరాజ్యం ఒక్కసారిగా భక్తి భావనలో మునిగిపోయింది.

Share this post with your friends