మే 23న శ్రీ తాళ్ళపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను తాళ్ళపాక, తిరుపతిలలో ఘనంగా నిర్వహించనున్న టీటీడీ.
తాళ్లపాక అన్నమాచార్యునికి (1408 – 1503) పదకవితా పితామహుడని పేరు. తొలి తెలుగు వాగ్గేయకారునిగా గుర్తింపు పొందాడు. తిరుమల వేంకటేశునిపై దాదాపు 32వేల సంకీర్తనలను రచించిన అన్నమయ్య మొదట నృసింహస్వామి భక్తుడు. అహోబిలంలో కొంతకాలం తీవ్రమైన తపస్సుచేసి స్వామిని మెప్పించాడని, ఆయన అనుగ్రహంతోనే పదకవితలు అల్లే విద్యను నేర్చుకున్నాడని చెబుతారు. వేంకటేశ ముద్రతోనే నరసింహునిపై అనేక కీర్తనలు రచించాడు. నృసింహుని పరంగా సంస్కృతంలో అన్నమయ్య రచించిన ‘ఫాలనేత్రానల’ అన్న కీర్తన, తెలుగులో రచించిన ‘ఆరగించి కూర్చున్నాడల్లవాడె’ కీర్తన సుప్రసిద్ధమైనవి. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ వంటి గాయకుల గాత్రంలో ఈ కీర్తనను వినవచ్చు. తిరుమల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అహోబిల లక్ష్మీనృసింహుని వైభవాన్ని వర్ణిస్తూ సాగే కీర్తన ఇది.