శ్రీరామనవమి అంటే రాముడి పుట్టిన రోజు అని కొందరు అంటారు. కాదు.. సీతారాముల పెళ్లి రోజని కొందరు అంటారు. అసలు శ్రీరామనవమి రాముడి పుట్టిన రోజా? పెళ్లి రోజా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిజానికి ఆ రోజు చైత్రశుద్ధ నవమి. నిజంగానే అదే రోజున సీతారాముల వివాహం జరిగిందా? లేదంటే రాముల వారి పుట్టిన రోజును మనం వివాహం జరిపిస్తున్నామా? అంటే శ్రీరాముడు త్రేతా యుగంలో జన్మించాడు. చైత్ర మాసం, వసంత ఋతువు శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రంలో.. కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు.
శ్రీరాముడు పుట్టినరోజుని జనమంతా పండుగలా జరుపుకుంటారు. అయితే రాముల వారు శివధనస్సును ఎక్కు పెట్టి సీతమ్మను పెళ్లి చేసుకునే విషయం హిందువులకు తెలియకుండా ఉండదు. ఇక ఆ తరువాత శ్రీరాముని పట్టాభిషేకమే అనుకుంటుండగా తండ్రి కోరిక మేరకు రాముల వారు సతీ సమేతంగా పధ్నాలుగేళ్లు అరణ్యవాసం చేస్తారు. ఆ తరువాత ఆయన అయోధ్యలో సీతమ్మతో కలిసి అడుగు పెట్టింది కూడా చైత్ర శుద్ధ నవమి నాడే అని ప్రజల విశ్వాసం. ఈ రోజునే సీతారాముల కల్యాణం జరిగిందని చెబుతారు. కాబట్టి శ్రీరాముని జన్మదినం, వివాహం, రాజ్య పునరాగమనం అన్నీ కూడా నవమి రోజునే జరిగాయని చాలా మంది నమ్ముతారు. అందుకే మనం సీతారాముల కల్యాణాన్ని నవమి రోజునే నిర్వహించుకుంటూ ఉంటాం.