వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ నృసింహ జయంతిని పురస్కరించుకుని తిరుమల వసంత మండపంలో బుధవారం శ్రీ నృసింహ పూజ శాస్త్రోక్తంగా జరిగింది. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఇందుకోసం శ్రీవారిని నృసింహ స్వామి అలంకారంలో సింహ వాహనంపై కొలువుదీర్చారు. సుదర్శన చక్రం, నరసింహుని ప్రతిమను ఏర్పాటుచేశారు. అభిముఖంగా శ్రీ నరసింహస్వామివారి ప్రతిమలను ఆశీనులను చేశారు.
పూజలో భాగంగా శ్రీ నృసింహ మంత్రాన్ని 108 సార్లు, శ్రీ నృసింహ అష్టోత్తర శతనామావళి, శ్రీ సుదర్శన మంత్రాన్ని 24 సార్లు పారాయణం చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.