స్త్రీ శక్తికి ప్రతిరూపంగా మనం దుర్గమ్మ తల్లిని కొలుచుకుంటాం. అయితే కేరళలోని ఒక ఆలయంలో మాత్రం అమ్మవారినే కాదు.. అమ్మకు ప్రతీకగా స్త్రీలను కూడా పూజిస్తారు. ఆసక్తికరమైన ఈ ఆలయం కేరళలోని అలప్పుజా జిల్లా ఉంది. ఇక్కడి ఆలయాన్ని ‘చక్కులత్తుకవు’ అమ్మవారి ఆలయం అని పిలుస్తారు. దుర్గమ్మ పంపానదీ తీరంలో చక్కులత్తుకవు అమ్మవారిగా వెలిసింది. ఈ అమ్మవారి ఆలయ విశేషం ఏంటంటే.. ఇక్కడ ఏ కోరిక కోరకున్నా కూడా తప్పక నెరవేరుతుందట. అందుకే ఈ అమ్మవారి ఆలయానికి కేరళ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వెళుతుంటారు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రతి శుక్రవారం ఇక్కడ మద్యం, గంజాయి వంటి వ్యసనాల నుంచి బయటపడలేని వ్యక్తులతో ప్రమాణం చేయిస్తారు. ఈ రోజున ప్రమాణం చేశాక ఆలయ నిర్వాహకులు వారికి ‘ఔషధ వెల్లం’ అనే ఓ ప్రత్యేకమైన తీర్థాన్ని అందిస్తారు. ముందుగా ఈ తీర్థాన్ని అమ్మవారి ముందు పెడతారు. దీంతో ఈ తీర్థానికి అద్భుతమైన శక్తి వస్తుందట. దానిని తాగిన భక్తులు వ్యసనాల జోలికే వెళ్లరట. ఇక మరో విశేషం ఏంటంటే.. నారీపూజ. ఈ ఆలయంలో స్త్రీలను సాక్షాత్తు ఆ అమ్మవారిగా భావించి ఆమెకు పాదపూజ చేస్తారు. ప్రతి డిసెంబర్‌లో ఆలయంలో ‘పొంగలా’ ఉత్సవం జరుగుతుంది.