రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో నిన్న వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకూ జరగనునున్న బ్రహ్మోత్సవాలకు ఈ నెల 1వ తేదీనే అంకురార్పణ జరిగింది. అదే రోజున స్వామివారికి మూషిక వాహన సేవ జరిగింది. నిన్నటి నుంచి చంద్రమౌళీశ్వర స్వామి వారికి వివిధ రకాల వాహన సేవలను నిర్వహిస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఇవాళ సాయంత్రం చంద్రప్రభ విహనంపై ఊరేగనున్నారు.
నిన్న ఉదయం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తరువాత స్వామివారిని కల్పవృక్ష వాహనంపై ఊరేగించారు. నిన్న సాయంత్రం హంసవాహనంపైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల5వ తేదీ సాయంత్రం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనునున్నారు. జూన్ 6వ తేదీన ధ్వజావరోహణం, రావణాసుర వాహనంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు.