హిందూ మతంలో ఏకాదశి తిథికి విశిష్ట స్థానం ఉంది. ఇక మోహిని ఏకాదశి గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని పదకొండవ రోజున ఏకాదశి తిధిని మోహిని ఏకాదశిగా జరుపుకోనున్నారు. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ రోజున మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున దానధర్మాలు చేస్తే చాలా మంచిదట. వారికి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుందట. జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఫలానా వారే ఆచరించాలని లేదు.. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక మోహినీ ఏకాదశి మే 19న సూర్యోదయంతో ప్రారంభం కానుంది.
ధాన్యం, పండ్లు, బట్టలు, డబ్బు, రాగి సామాను, దుప్పటి, నెయ్యి, మెడిసిన్.. ఇలా ఏదైనా శక్తి మేరకు దానం చేయవచ్చు. అయితే దానం చేసే ముందు తప్పక శుచిగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం దానం చేయాలనుకున్న వస్తువులను ముందుగా విష్ణు మూర్తికి సమర్పించి ఆ తరువాత మాత్రమే దానం చేయాలి. అలాగే మనం ఎవరికైతే దానం చేస్తున్నామో ఆ వ్యక్తిని గౌరవప్రదంగా చూడాలి. దానం చేసిన తర్వాత మనసులో చెడు తలంపులు రానివ్వకూడదు. ఈ రోజు చేసే దానం సత్ఫలితాలను ఇస్తుంది. కోరికలు నెరవేరడమే కాకుండా.. ఈ రోజు దానం చేయడం వలన గ్రహాల స్థితిగతులు మారి ఆర్థికంగా వృద్ధి చెందుతారట.