ప్రతి ఒక్క హిందువు చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. ఈ యాత్ర మే 10 నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పర్యాటక శాఖ పూర్తి చేసింది. చార్దామ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి నేటి నుంచి ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా మంది భక్తులు ఆన్‌లైన్ ద్వారా ఈ యాత్ర కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. అయితే చేసుకోని వారి కోసం నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ హరిద్వార్, రిషికేశ్‌లలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అలాగే ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ధర్మనగరిలోనూ ఆరు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది.
పైన చెప్పిన కేంద్రాల వద్ద ఒక్కో ధామ్‌కు 500 మంది యాత్రికుల పేర్లను నమోదు చేస్తారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి ధామ్ యాత్రికుల కోసం ఐదు వందల స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి అధికారులు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక ఈ కౌంటర్లలోనూ అధికారులు యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకునే వారి కోసం ఇంటర్నెట్ సౌకర్యం, లైట్, విద్యుత్‌తో పాటు ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, చల్లటి నీరు తదితర ఏర్పాట్లను చేశారు. ఇకెందుకు ఆలస్యం.. చార్దామ్ యాత్రకు ఇప్పటికే ఆయా ప్రదేశాలకు చేరుకున్న యాత్రీకులంతా నిర్దేశిత ప్రాంతాల్లో స్లాట్‌లను బుక్ చేసుకోండి.