శ్రీరామనవమి పర్వదినం వచ్చేస్తోంది. నవమి రోజున సీతారాముల కల్యాణం సర్వత్రా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి అనగానే భద్రాచలం గుర్తుకు వస్తుంది. అయితే ఉత్తరాంధ్ర భద్రాద్రి అని కూడా ఒక ప్రాంతాన్ని పిలుస్తారు. అదే రామతీర్థం. ఇక్కడి ఆలయ విశిష్టతలు చాలా ఉన్నాయి. శివకేశవులను ఒకేచోట కొలవడమనేది చాలా అరుదు. రామతీర్థంలో శివకేశవులను కొలుస్తారు కాబట్టి ఆ ఆలయానికి అంతి విశిష్టత. ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రామతీర్థం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది.
ఇక్కడ శ్రీరాముడు కొంత కాలం పాటు వనవాసం చేశాడని చెబుతుంటారు. ఆ సయమంలో రాములవారు శివుడి మంత్రం జపించారట. ఈ విషయం పురాణాల్లో ఉందని కూడా చెబుతుంటారు. ఇక ఈ ఆలయ మరో విశిష్టత ఏంటంటే.. రామాలయం పక్కనే ఒక కోనేరు ఉంటుంది. ఏ కాలంలో అయినా సరే.. చివరకు ఎండలు మండుతున్నా ఇక్కడి కోనేటిలో నీరు మాత్రం ఇంకిపోదు. ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపునకు వెళితే పర్ణశాల, సీతమ్మ వారి పురిటి మంచం, పాండవుల పంచలు, భీముని బుర్ర, బుద్ద విగ్రహం, పలుకు రాయి వంటివి చూడొచ్చు. ఇక రామతీర్థంలో మరో విశేషం ఏంటంటే.. ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవునా 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం ఉంటుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు.