అరుణాచలం గురించి తెలియని వారుండరు. దక్షిణ భారతంలోని తమిళనాడులో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అరుణాచలం విరాజిల్లుతోంది. అరుణాచలంను తమిళులు తిరువణ్ణామలై అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణకు భక్తులు ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు. అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న అనంతరం గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. అయితే గిరి ప్రదక్షిణ చేసేటపుడు ఎలా పడితే అలా చేయకూడదు. కొన్ని నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఇక కొన్ని జాగ్రత్తలు మన కోసం తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత దూరం కూడా ఏమాత్రం ఇబ్బంది అనిపించదు. అదంతా అరుణాచలేశ్వరుని దయే అంటారు భక్తులు. ఇక గిరి ప్రదక్షిణ చేసే వారు పాదరక్షలను వినియోగించకపోవడం ఉత్తమం. ఇలా చేయడం వలన చాలా పుణ్యం దక్కుతుందని చెబుతారు. గిరి ప్రదక్షిణ ఎడమవైపు మాత్రమే చేయాలి. ఎందుకంటే.. కుడివైపు సిద్దులు దేవతలు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని నమ్మకం. ఓం అరుణాచల శివ అని స్మరిస్తూ ప్రదక్షిణ చేస్తే ఫలితం బాగుంటుంది.
ఉదయం 10 గంటలలోపు ప్రదక్షిణ ముగించుకుంటే ఉత్తమం. అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం అందువల్ల గిరి ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు మహా శివుడికి ప్రదక్షిణ అని భక్తుల నమ్మకం.