తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో ఇవాళ్టి నుంచి జరగనున్న పత్రపుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఇవాళ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 10 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ పత్రపుష్పయాగ మహోత్సవం జరుగనుంది.
పత్రపుష్పయాగ మహోత్సవంలో భాగంగా తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలు, పత్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి తిరువీధి ఉత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన దంపతులెవరైనా రూ.200 చెల్లించి పత్రపుష్పయాగంలో పాల్గొనవచ్చు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లో అర్చక పరిచారకులు, భక్తుల వల్ల తెలియక జరిగిన పొరబాట్లకు ప్రాయశ్చిత్తంగా పత్రపుష్పయాగం నిర్వహిస్తారు.