పానకం ఎలా చేస్తారు? బెల్లం, మిరియాలు. నీళ్లు, సుగంధ ద్రవ్యాలతో చేస్తారు. మరి అవి ఎప్పుడైనా దొరుకుతాయి కదా? అలాగని ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు చేసుకోము. అసలు చేసుకోవాలన్న ఆలోచన కూడా రాదు. కేవలం శ్రీరామనవమి రోజునే పానకం ఎందుకు గుర్తొస్తుంది? అంటే దీనికి కారణం లేకపోలేదు. శ్రీరామనవమి రోజున ఆలయం వద్దే కాదు.. ఇళ్లలోనూ పక్కాగా పానకం చేసుకుంటారు. సాధారణంగా ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. నిజానికి ఉగాది రోజున ఉగాది పచ్చడికి ఉన్నంత ప్రాధాన్యత దేనికీ ఉండదు. అలాగే శ్రీరామనవమికి పానకం.
హిందువులు ఒక్కో పండుగకు ఒక్కో స్వామివారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. ఆరోగ్య పరమైన అంశాలు కూడా ఈ నైవేద్యంలో మిళితమై ఉంటాయి. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు జన్మించిన రోజునే ఆయన కల్యాణం కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. విష్ణుమూర్తికి పానకమంటే చాలా ఇష్టం. అందుకే ఆ రోజున స్వామివారికి పూలు, పండ్లతో పాటు పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇక పానకంలో వినియోగించే బెల్లం, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు కొన్ని వ్యాధులను నివారిస్తాయి. ఇలా స్వామివారికి ఇష్టంతో పాటు ఆరోగ్యం కాబట్టి పానకం తయారు చేసి అందిస్తుంటారు.