12న సమస్త దోష నివారణకు శ్రీ కోదండ రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్పయాగం

తిరుపతి శ్రీకోదండ రామస్వామి వారి ఆలయంలో మే 12వ తేదీన పుష్పయాగం నిర్వహించ‌నున్నారు. దీనికి గానూ మే 11వ తేదీన సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జ‌రుగ‌నుంది. మే 12న ఉదయం నుంచి రాత్రి వారకూ స్వామి వారికి వివిధ సేవలను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మవారి ఉత్సవ‌ర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంత‌రం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా ల‌క్ష్మణ స‌మేత శ్రీ కోదండ‌ రామ‌స్వామి వారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్రహిస్తారు.

ఈ కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొనవచ్చు. అయితే దంపతులకు మాత్రమే అవకాశం ఉంది. దంపతులు రూ.1,000/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు. శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 5 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

Share this post with your friends