మరికొన్ని గంటల్లో శ్రీరామనవమి దక్షిణాదిలో పండుగంతా భద్రాద్రిలోనే కనిపిస్తుంది. అందుకే భద్రాద్రి దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతోంది. భద్రాద్రి ఆలయ విశిష్టతలు ఎంత చెప్పుకున్నా తరగవు. రామయ్య తండ్రి ఆలయంలో ఎటు చూసినా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. స్వామివారి ఆలయ గర్భగుడి వైపు చూస్తే ఆ గుడిపై ఒక సుదర్శన చక్రం కనిపిస్తుంది. దాని విశిష్టత ఏంటంటే.. అది ఎవరో తయారు చేసిన సుదర్శన చక్రం కాదు. అవాక్కైనా ఇది నిజం. మరి ఆ సుదర్శన చక్రం ఎలా వచ్చింది అంటారా?
భద్రాద్రి ఆలయాన్ని భక్త రామదాసు నిర్మించిన అనంతరం ఆలయ గర్భగుడిపై సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించాలని భావించారట. ఈ క్రమంలోనే ఎందరో పెద్ద లోహ శిల్పులను పిలిపించి సుదర్శన చక్రాన్ని చేయించడానికి ప్రయత్నించారట. కానీ ఎంత మంది వచ్చి.. ఎన్ని సార్లు చేసినా కూడా సుదర్శన చక్రం విరిగిపోవడమో లేదంటే సరిగా కుదరక పోవడమో అవుతోందట. దీంతో ఆందోళన చెందిన రామదాసుకి రాముల వారు కలలోకి వచ్చి సామాన్యులెవరూ సుదర్శన చక్రాన్ని నిర్మించలేరని.. తన సుదర్శన చక్రం గోదావరిలో ఉందని దానిని తీసుకొచ్చి ప్రతిష్టించాలని కోరారట. మరుసటి రోజు రామదాసు గోదావరి మొత్తం వెదికించినా కనిపించలేదట. దీంతో మళ్లీ రామదాసు కలలోకి రాముడు వచ్చి అపరభక్తుడివైన నీకు మాత్రమే ఆ సుదర్శన చక్రం కనిపిస్తుందని చెప్పారట. అప్పుడు రామదాసు గోదావరిలో చేయి పెట్టగానే సుదర్శన చక్రం చేతికి తాకిందట. దానిని తీసుకొచ్చి స్వామివారి గర్భగుడిపై ప్రతిష్టించారు.