విఘ్నేశ్వరుడి ఆలయం కోసం తమ దర్గా భూమిని విరాళమిచ్చిన ముస్లింలు..

భారత దేశాన్ని లౌకిక దేశం అంటారు. మతాలు వేరైనా మనుషులంతా కలిసి మెలిసే ఉంటారు. హిందూ దేవాలయాలకు ముస్లింలు వస్తుంటారు. అలాగే దర్గాలకు హిందువులు వెళుతుంటారు. తాజాగా ఓ గ్రామంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హిందూ దేవాలయ నిర్మాణానికి ముస్లింలు తమ భూమిని విరాళంగా ఇచ్చారు. ఇధి తమిళనాడులోని తిరుపూర్ జిల్లా గణపతిపాళయం పంచాయతీలోని ఒట్టపాళయం గ్రామంలోని రోజ్ గార్డెన్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో 300కు పైగా హిందూ, ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో దర్గా ఉంది కానీ హిందువులకు మాత్రం దేవాలయం లేదు. దీంతో గ్రామస్తులంతా కలిసి దేవాలయాన్ని నిర్మించాలనుకున్నారు.

అయితే ఆలయ నిర్మాణానికి తగినంత భూమి లేకపోవడంతో కాస్త ఇబ్బందికరంగా మారింది. విషయం తెలుసుకున్న ముస్లింలు తమ మసీదుకు చెందిన రూ.6 లక్షల విలువైన 3 సెంట్ల స్థలాన్ని దేవాలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ముస్లింలు భూమి ఇచ్చిన వెంటనే ఇక్కడ విఘ్నేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ పనులన్నీ పూర్తి కావడంతో నిన్న ఆలయానికి మహా సంప్రోక్షణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముస్లింలు ఐదు ట్రేలలో వినాయకుడి పూజకు కావాల్సిన సామగ్రిని ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ అందజేశారు. ఇక హిందువులు వచ్చిన ముస్లింలకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ముస్లింలు సైతం కుంభాభిషేకానికి బారులు తీరడం కన్నుల పండువగా అనిపించింది. గ్రామంలో మత సామరస్యం మరోసారి పెల్లుబికింది.

Share this post with your friends