అమ్మవారి ఆలయంలో అద్భుతం.. తిలకించేందుకు బారులు తీరుతున్న భక్తజనం

హైదరాబాద్ అద్భుత ఘట్టానికి వేదికగా మారింది. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే జంట నగరాలు ఒక్కసారిగా భక్తి భావంలో నిండిపోయింది. అమ్మవారి ఆలయంలో మహిమాన్వితమైన వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. అమ్మవారు ఒక్కసారిగా పాలు తాగుతుండటం.. చూసిన ప్రతి ఒక్కరికీ అది ఆశ్చర్యకరంగా మారింది. హైదరాబాద్ మియాపూర్‌లోని మదీనాగూడ పోచమ్మ దేవాలయంలో అమ్మవారు పాలు తాగుతోందన్న వార్త క్షణాల్లోనే భాగ్యనగరమంతా పాకిపోయింది. విషయం తెలుసుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ఆలయం మొత్తం పోచమ్మ తల్లి నామస్మరణతో మారుమోగింది.

ఈ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు నాలుగు రోజులుగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ అద్భుతాన్ని చూసేందుకు బారులు తీరారు. చెంచాతో పాలను తీసుకుని అమ్మవారి నోటి వద్ద ఉంచితే తాగుతోందని భక్తులు చెబుతున్నారు. అమ్మవారు ఈ ఆలయంలో స్వయంభువుగా వెలిశారు. అమ్మవారికి ఆలయ పూజారులు పాలను నైవేద్యంగా సమర్పించారు. వాటిని అమ్మవారు తాగడాన్ని గమనించిన పూజారులు వెంటనే ఈ విషయాన్ని ఆలయ కమిటీకి తెలిపారు. దీనికి శాస్త్రీయ కారణాలు ఏమున్నా కానీ ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Share this post with your friends