జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారి జయంతి సందర్భంగా ఆలయం భక్తులతో రద్దీగా మారింది. దీక్ష విరమణ కోసం వచ్చిన హనుమాన్ మాలధారులతో కొండంతా కాషాయమయంగా కనిపిస్తోంది. దీక్షాపరుల రాకతో కొండంతా రామనామస్మరణతో మారు మోగుతోంది. స్వామివారి జయంతి ఉత్సవాలు ఇక్కడ రెండు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులతో పాటు మాల ధారులు సైతం వచ్చి మాల విరమణ చేస్తున్నారు. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు భద్రతా చర్యలు పెంచారు.
ఇవాళ్టితో కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ముగియనున్నాయి. దీక్షా విరమణ కోసం వచ్చే భక్తులకు 300 మంది అర్చకులను, తలనీలాల సమర్పణ కోసం 1500 మంది నాయి బ్రహ్మణులను ఆలయ అధికారులు నియమించారు. ఎండాకాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా తాగు నీరు, చలువ పందిళ్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. కొండగట్టు అంజన్నకు భద్రాద్రి నుంచి శ్రీ సీతారాముల తరుఫున అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించడంతో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక మూడు రోజులుగా లోక కల్యాణార్థం యాగశాలలో హోమాలను సైతం ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు.