అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ప్రారంభం

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఆలయంలో జూన్ 17 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ సిబ్బంది, భక్తులు, అర్చకులు కలిసి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు మంగళవారం నిర్వహించే విశిష్ట క్రతువును నిర్వహిస్తారు. సంప్రదాయ ఆలయ శుద్ధి అనంతరం 11.00 గంటలకు భక్తులకు సర్వ దర్శనం ప్రారంభమవుతుంది.

ఇక కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Share this post with your friends