కుంతీమాతకు సూర్యుడు కర్ణుడిని ప్రసాదించిన కథ అందరికీ తెలిసిందే. అసలు ఎందుకు కర్ణుడిని సూర్యుడు ప్రసాదించాడనేది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఆ కథేంటంటే. ఓ రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని అభేద్యమైన వెయ్యి కవచాలను వరంగా పొంది సహస్ర కవచుడని పేరు తెచ్చుకున్నారు. ఇక బ్రహ్మ వరంతో సహస్ర కవచుడు రెచ్చి దేవతలు సహా ప్రాణకోటినంతటినీ చిత్ర హింసలు పెట్టాడు. దీంతో దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు.
అప్పుడు విష్ణుమూర్తి తాను బదరికావనంలో నరనారాయణులు రూపంలో తపస్సు చేసుకుంటామని అప్పుడే సహస్ర కవచుడిని వధిస్తామని చెబుతాడు. దేవతలకు ఇచ్చిన అభయం ప్రకారం విష్ణుమూర్తి.. నరనారాయణుల రూపంలో బదరికా వనంలో తపస్సు చేయసాగారు. ఒకరోజు సహస్ర కవచుడు ఆయువు మూడి నర నారాయణులతో యుద్ధం చేసేందుకు వనానికి చేరుకుని వారిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అయితే తామిద్దరం యుద్ధం చేయబోమని.. తమలో ఒకడు మాత్రమే యుద్ధం చేస్తాడని చెబుతారు. మరొకరి తపస్సుకు అంతరాయం కలగకుండా చూసేలా అయితే యుద్ధం చేస్తామని చెప్పగా సహస్ర కవచుడు సరేనంటాడు.
నారాయణునితో సహస్ర కవచుడు భీకర యుద్ధాన్ని వెయ్యేళ్లపాటు చేస్తాడు. ఈ క్రమంతోనే అతని శరీరం నుంచి ఒక కవచాన్ని నారాయణుడు భేదిస్తాడు. అనంతరం నారాయణుడు తపస్సుకు ఉపక్రమించడంతో నరుడు యుద్ధానికి దిగి 999 కవచాలను భేదించగా.. మిగిలిన ఒక్క కవచాన్ని కాపాడుకునేందుకు సూర్యుడిని ఆశ్రయిస్తాడు. తాను అభయమైతే ఇవ్వలేను కానీ తన దగ్గర ఉండిపోతే నరనారాయణుల అవతార సమాప్తి అనంతరం విడుదల కలిగిస్తానని చెబుతారు. ఇక ఆ తరువాత సహస్ర కవచుడినే కుంతీ దేవికి పసిబిడ్డగా సూర్యుడు అందించాడు. ఇదీ కథ