తిరుపతి: కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. జూన్ 6వ తేదీ వరకూ ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. నిన్న సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహనం.. అనంతరం సాయంత్రం పెద్ద శేష వాహనంపై స్వామివారు ఊరేగించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
జూన్ 7వ తేదీన మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకూ పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో జూన్ 1వ తేదీ సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి దంపతులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. కల్యాణోత్సవంలో పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.