రెండు పక్షలు కన్నయ్య కోసం ఏం చేసేవో తెలుసుకున్నాం కదా. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. కృష్ణుడు ఇంద్ర పూజ మానిపించి గోవర్ధన పర్వతానికి పూజ చేయించాడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి పుష్కలావర్త మేఘాలని పంపించి వర్షంతో పాటు శిలలూ కురిపించటం మొదలెట్టాడు. వెంటనే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలి మీద ఎత్తి గోపీ, గోపాలకులు అందరినీ ఆవులూ, దూడలతోబాటు ఆ పర్వతం కిందకి రమ్మన్నాడు. అందరూ ఆ పర్వతం కిందకి వొచ్చి ఆ శిలలతో కూడిన వర్షాన్ని తప్పించుకున్నారు. కృష్ణుడు మిగతా జీవజాలాన్నీ పర్వతం కిందకి రమ్మన్నాడు అన్నీ వొచ్చేశాయి. కానీ బాదం చెట్టు మీద ఉన్న ఆ రెండుపక్షుల మధ్య గొడవ మొదలైంది.
అన్నా, తమ్ముడూ ఇద్దరూ పోట్లాడుకోవడం మొదలెట్టారు. ‘అన్నా, అందరూ ఈ వానని తట్టుకోలేక ఆ కొండకింద దాక్కున్నారు. పద అన్నా, మనం కూడా ఆ కొండ కిందకి వెళదాము’ అన్నాడు శబరుడు. యాస్కుడు అడ్డంగా తలఊపుతూ ‘ఇన్నాళ్ళు మనం, వర్షం వొచ్చినా, ఎండ వొచ్చినా కృష్ణుడికి పైన ఎగిరేవాళ్ళం. తాను ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద ఎగిరే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు కాస్త పెద్ద వర్షం వొచ్చిందని వొదిలేసి వెళ్ళిపోతామా?’ అన్నాడు. ‘అన్నా, ఇది పెద్ద వర్షం కాదు, ఇది శిలావర్షం, ప్రళయ భీభత్స వర్షం. మనం తట్టుకోలేము. అందుకని గోవర్ధన పర్వతం కిందకి పోదాం’ అన్నాడు శబరుడు. అప్పుడు తాను రానని యాస్కుడు భీష్మించడంతో చేసేదేమీ లేక తనను తాను రక్షించుకోవడం కోసం శబరుడు పర్వతం కిందకు వెళ్లాడు.